ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పాదయాత్ర
ఓటు చోరీ, అక్రమాలకు పాల్పడిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండ న్యూస్,: ఏఐసీసీ ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సోమవారం భారీ పాదయాత్ర నిర్వహించారు. హన్మకొండ అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఈ పాదయాత్రలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ,కూడా చైర్మెన్ గుండు సుధారాణి , డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి , హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్ తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.పాదయాత్రకు ముందు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాలతో పాదయాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటుచోరి అక్రమాలకు పాల్పడిన ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి ఓటు ప్రజల హక్కుకు ప్రతీక అని అన్నారు. ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఆయనపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ప్రధాన రహదారుల మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఓటు హక్కును పరిరక్షించాలి అంటూ నినాదాలు చేస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి దుద్దిళ్ల శ్రీను బాబు,రాష్ట్ర అధికార ప్రతినిధి రవళి రెడ్డి,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఒడితల ప్రణవ్, రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ,మండల,డివిజన్,గ్రామ స్థాయి ముఖ్య నాయకులు, చైర్మన్లు, డివిజన్ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


