మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదం,మరొకరి పరిస్థితి విషమం
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమకొండ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ సందర్బంగా హన్మకొండ రోడ్ ప్రధాన రహదారిపై చెత్తను సేకరిస్తున్న మున్సిపాలిటీ ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు ట్రాక్టర్ ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హుస్నాబాద్ పట్టణంలోని హనుమకొండ రోడ్డు మార్గంలో చెత్తను సేకరిస్తూ నిలిపి ఉంచిన మున్సిపల్ ట్రాక్టర్‌ను ఒకే ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ప్రమాద ధాటికి బైక్‌పై ఉన్న నద్దునూరి శ్రీకాంత్, నరసింహలకు తీవ్ర గాయాలై, రోడ్డుపై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనంపై ఉన్న మూడో వ్యక్తి నద్దునూరి శ్రీను తీవ్రంగా గాయపడటంతో స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న హుస్నాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.సంఘటన స్థలాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మమాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తోడు
హుస్నాబాద్ పట్టణంలో ప్రతిరోజు ఉదయం ప్రధాన రహదారిపై ట్రాక్టర్లలో మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరిస్తారు. కార్మికులు సేకరిస్తున్న సమయంలో వారితో ప్రత్యేకంగా అధికారులు పర్యవేక్షణ అవసరం ఉన్న కనీసం ఎవరు కూడా ఉండటంలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లను ఇష్టారాజ్యంగా నడిరోడ్డు మీద నిలపడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కూడా తీవ్ర గాయాలు అయిన సంఘటనలు ఉన్నాయి.ఇప్పటికైనా అధికారులు ప్రధాన రహదారిపై సేకరిస్తున్న సమయంలో అధికారులు పర్యవేక్షణ చేయాలని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


