సింగూరు–మంజీరా ప్రాంతాలకు ప్రత్యేక ప్లాన్
వేసవి తాగునీటి సరఫరాపై జలమండలి ముందస్తు కార్యాచరణ
హైదరాబాద్: రానున్న వేసవిలో నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుత నీటి వనరులు, ప్రాంతాల వారీగా ఉన్న నీటి డిమాండ్, పంపిణీ వ్యవస్థ, ప్రత్యామ్నాయ జలవనరులను సమగ్రంగా పరిశీలించి వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. సింగూరు–మంజీరా జలవనరులపై ఆధారపడిన ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ వనరులను ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. వేసవి నీటి సరఫరా సన్నద్ధత, సింగూరు–మంజీరా కాంటింజెన్సీ ప్లాన్, పవర్ బోర్‌వెల్స్ పునరుద్ధరణ, ఫిల్లింగ్ స్టేషన్ల అవసరాలు, నెట్‌వర్క్ కనెక్టివిటీ, పారిశ్రామిక–బల్క్ నీటి సరఫరా, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వి నియోగంపై బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జేఎండీ మయాంక్ మిట్టల్‌తో కలిసి ఎండీ అశోక్‌రెడ్డి ఈ సమీక్ష చేపట్టారు.
సింగూరు–మంజీరా ప్రాంతాలకు ప్రత్యేక కార్యాచరణ
సింగూరు–మంజీరా నీటి వనరులపై ఆధారపడిన ప్రాంతాలను గుర్తించి, అత్యవసర పరిస్థితుల్లో ఏ ప్రత్యామ్నాయ వనరు నుంచి ఎంత నీటిని, ఏ మార్గంలో సరఫరా చేయవచ్చో స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని ఎండీ ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఇంటర్‌కనెక్షన్లు, జంక్షన్లు, వాల్వ్‌లు, పైప్‌లైన్ అనుసంధానాలను ముందుగానే పరిశీలించి సిద్ధంగా ఉంచాలని సూచించారు. వేసవిలో అధిక నీటి డిమాండ్ ఉండే ప్రాంతాలు, చివరి ప్రాంతాలు, తక్కువ ఒత్తిడితో నీరు అందుతున్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట నెట్‌వర్క్ బలోపేతానికి సాంకేతిక ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
నీటి వృథాపై నియంత్రణ
వేసవిలో నీటి వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున తాగునీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎండీ సూచించారు. అనవసరంగా నీటిని వృథా చేయడం, గృహేతర అవసరాలకు తాగునీటిని వినియోగించడం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో గుర్తించి నియంత్రించాలని తెలిపారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు
ప్రస్తుతం ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యం, ట్యాంకర్ల రాకపోకలు, రోజువారీ నీటి డిమాండ్‌ను పరిశీలించి వేసవికి అవసరమైన అదనపు ఫిల్లింగ్ స్టేషన్లను ముందుగానే గుర్తించాలని ఆదేశించారు. నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఫిల్లింగ్ సదుపాయాలు ఉండేలా పాయింట్లను హేతుబద్ధీకరించాలని సూచించారు.
పవర్ బోర్‌వెల్స్ పునరుద్ధరణ
పనిచేస్తున్న పవర్ బోర్‌వెల్స్‌కు ఒక్కోదానికి 15 రోజుల్లోగా ఒక లైన్‌మెన్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని ఎండీ ఆదేశించారు. బోర్‌వెల్ వివరాలు, నీటి లభ్యత, పనిచేసే సమయం, సరఫరా చేసే ప్రాంతం తదితర సమాచారంతో కేంద్రీకృత ఆన్‌లైన్ డేటాబేస్ రూపొందించాలని సూచించారు.పనిచేయని బోర్‌వెల్స్‌లో వేసవి అవసరాలకు ఉపయోగపడే వాటిని గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పునరుద్ధరించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రత్యామ్నాయ నీటి వనరులు లేని, సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ట్రీటెడ్ వాటర్ వినియోగానికి ప్రాధాన్యం
తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన మురుగునీటిని పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్, నిర్మాణ పనులు, సెంట్రల్ మీడియన్లు వంటి గృహేతర అవసరాలకు విస్తృతంగా వినియోగించాలని ఎండీ సూచించారు.ట్రీటెడ్ వాటర్ అందుబాటులో ఉన్న ప్రాంతాలు, సమీపంలోని గృహేతర నీటి అవసరాలు, అవసరమైన నీటి పరిమాణం, ట్యాంకర్లు లేదా పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేసే అవకాశాలపై సోర్స్–డిమాండ్ మ్యాపింగ్ చేపట్టాలని ఆదేశించారు. జలమండలి ఎస్టీపీలతో పాటు నగరంలోని ప్రైవేట్ ఎస్టీపీలను కూడా అవసరమైన చోట ట్రీటెడ్ వాటర్ వనరులుగా వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
పారిశ్రామిక, బల్క్ నీటి సరఫరాపై సమీక్ష
పారిశ్రామిక, బల్క్ వినియోగదారులకు ప్రస్తుతం అందిస్తున్న నీటి పరిమాణం, సరఫరా విధానం, సంబంధిత జలవనరులను సమీక్షించాలని ఎండీ ఆదేశించారు. సింగూరు–మంజీరా కాంటింజెన్సీ అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే పారిశ్రామిక, బల్క్ సరఫరాపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారుఈ సమావేశంలో జలమండలి మల్కాజిగిరి ఈడీ పంకజ, ఆపరేషన్ డైరెక్టర్లు నారాయణ, సత్యనారాయణ, కిరణ్‌కుమార్, టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలతో పాటు ట్రాన్స్‌మిషన్, ఐటీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


