జ్ఞానేష్ కుమార్‌ను డిస్మిస్ చేయాలి
- నవంబర్ 1న ‘చలో ఢిల్లీ’
- పవన్, అంక్షారెడ్డి, వెంకట్ రెడ్డి
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సర్ పేరుతో ఓట్లు తొలగిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే ఆ పదవి నుండి తొలగించి అరెస్టు చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం గజ్వేల్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తూంకుంట అంక్షారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల వెంకట్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ గా పని చేయాల్సిన ఎన్నికల సంఘం ఆర్ఎస్ఎస్, బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రానికి కీలుబొమ్మగా మారిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా విషయంలో చోటుచేసుకున్న పరిణామాలకు చీఫ్ ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలని అన్నారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల తరహాలోనే ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారిందని ఎద్దేవా చేశారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం పనితీరుపై వచ్చిన ఆరోపణల పట్ల సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తూ ఎలక్షన్ కమిషన్ ప్రధాని మోడీ, అమిత్ షా కనుసన్నల్లో విధులు నిర్వహిస్తున్నట్లు ఘాటుగా విమర్శించారు. బీజేపీ వ్యతిరేక దళిత మైనార్టీ, క్రిస్టియన్, యువత ఓట్లను తొలగించి అనుకూల ఓట్లను పొందుపరుస్తున్నట్లు తెలిపారు. స్పందించని పక్షంలో ఇందులో సూత్రధారు లు, పాత్రధారులైన వారికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. లక్షలాది ఓట్లను తొలగిస్తూ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్న సీఈసీ తీరును తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన బాట పట్టనున్నట్లు హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఈ నెల 6న చలో కలెక్టరేట్, 8వ తేదీన లోక్ భవన్ ముట్టడి, నవంబర్ ఒకటో తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు బట్టు దయానంద రెడ్డి, శివలింగ కృష్ణ, రాజేశం, చింత శ్రీను తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


