గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమీక్ష
భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, పర్యావరణ అనుమతులు, కాలువల పనులు, సవరించిన అంచనాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం
హుస్నాబాద్ , సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై శనివారం రోజున సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం (R&R), పర్యావరణ అనుమతులు, సవరించిన అంచనాలు, కాలువల పనులు, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా వివరించారు.2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 2013 నాటికి సుమారు 57 శాతం పనులు పూర్తయ్యాయి. అనంతరం వివిధ పరిపాలనా కారణాలతో భూసేకరణ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది.2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి, గణనీయమైన పురోగతి సాధించినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. మిగిలిన భూసేకరణను కూడా వేగవంతం చేసి ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.గౌరవెల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.17 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రులు సూచించారు.వివాహిత కుమార్తెలకు పునరావాస ప్రయోజనాలు, పాత మరియు కొత్త ముంపు ప్రాంతాల పరిధిలోని కుటుంబాలకు సంబంధించిన అంశాలను కూడా సమావేశంలో సమీక్షించారు.గౌరవెల్లి కాలువలకు సంబంధించిన భూసేకరణ పురోగతిని కూడా మంత్రులు సమీక్షించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి, లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి కాలువల పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రులు ఆదేశించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పర్యావరణ అనుమతుల అంశంపై సమావేశంలో చర్చించారు. సంబంధిత కేంద్ర సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన తాజా పర్యావరణ అనుమతులు పొందేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని వివరించారు.భూసేకరణ, పునరావాసం, ధరల పెరుగుదల తదితర కారణాల నేపథ్యంలో గౌరవెల్లి రిజర్వాయర్, కాలువలకు సంబంధించిన సవరించిన అంచనాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పనులకు పరిపాలనా అనుమతులు పొందిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఎంఎంఆర్ ప్యాకేజీ-3 పనులకు సంబంధించిన సవరించిన అంచనాలు, అదనపు నిర్మాణాల ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా సమీక్ష జరిగింది. అవసరమైన పర్యావరణ అనుమతులు, ఇతర ప్రభుత్వ అనుమతులు పొందిన వెంటనే గౌరవెల్లి రిజర్వాయర్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పెండింగ్ అంశాలను నీటిపారుదల, రెవిన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. భూసేకరణ, పునరావాసం, అనుమతులు తదితర అంశాల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకుని ప్రాజెక్టు పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేసే దిశగా ముందుకు సాగాలని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, భూసేకరణ - పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్‌సీ జనరల్ రమేష్ బాబు, ఈఎన్‌సీ ఓ&ఎం మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్‌తో పాటు మూడు జిల్లాలకు చెందిన అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


