పెద్ది సుదర్శన్ రెడ్డికి అశ్రునయనాలతో తుది వీడ్కోలు
- వేలాది మంది అభిమానుల నడుమ అంతిమయాత్ర
- పలువురు రాజకీయ ప్రముఖుల నివాళులు
- తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర
నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ యోధుడు,నల్లబెల్లి ముద్దు బిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డికి శుక్రవారం ఆయన స్వగ్రామంలో వేలాది మంది అభిమానులు, ప్రజల మధ్య అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు సాగిన అంతిమయాత్ర జనసంద్రాన్ని తలపించింది. రహదారుల వెంట ప్రజలు బారులు తీరుతూ పూలవర్షం కురిపించి తమ అభిమాన నాయకుడికి కన్నీటి నివాళులర్పించారు. మహిళలు, వృద్ధులు, యువకులు భావోద్వేగానికి లోనై విలపించగా, అంతిమయాత్ర మొత్తం విషాద వాతావరణంలో సాగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. నర్సంపేట ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలను అంతిమయాత్రలో పాల్గొన్న నాయకులు గుర్తు చేసుకున్నారు.
పలువురు రాజకీయ ప్రముఖుల నివాళులు
పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించి అంతిమయాత్రలో రాష్ట్ర మంత్రి సీతక్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు,గంగుల కమలాకర్,సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి,ఎంపీ పొరిక బలరాం నాయక్,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య , రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి బసవరాజు సారయ్యతో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర
పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ కార్యక్రమాలు, ఆందోళనలు, ప్రజాసభల్లో పాల్గొంటూ ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ ప్రాంతాలకు చేర్చడంలో తనవంతు పాత్ర పోషించారు. ఉద్యమం ఉద్ధృతంగా సాగిన రోజుల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. రాష్ట్ర సాధన అనంతరం కూడా తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారం, రైతుల సంక్షేమం, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. రాజకీయాల్లో నిరాడంబరత, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మరణంతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించిన ఓ సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందని పలువురు ఉద్యమకారులు, నాయకులు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, వేలాది మంది అభిమానుల రోదనల మధ్య ఆయన స్వంత వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ వందనం అనంతరం అంతిమ సంస్కారాలు పూర్తి కాగా, హాజరైన ప్రజలు భారమైన హృదయాలతో తమ అభిమాన నాయకుడికి తుది వీడ్కోలు పలికారు.తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలు, ప్రజల పట్ల చూపిన అంకితభావం చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు నాయకులు, అభిమానులు నివాళుల సందర్భంగా పేర్కొన్నారు.

Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
