56 అడుగులకు చేరిన గోదావరి
భద్రాచలం వద్ద గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు..
కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శనివారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 56.00 అడుగులకు చేరుకోగా, 15,90,778 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ భద్రాచలం గోదావరి స్నాన ఘాట్లు, కరకట్ట ప్రాంతంతో పాటు భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రభావిత గ్రామాల పరిస్థితి, సహాయక చర్యల పురోగతిపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను టామ్‌టామ్, మైకింగ్ ద్వారా నిరంతరం అప్రమత్తం చేయాలని, వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను ఆలస్యం చేయకుండా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, నాణ్యమైన భోజనం, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో వైద్య బృందాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారిపై వరద నీరు చేరిన ప్రాంతాల్లో వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బ్యారికేడ్లను దాటి వెళ్లకుండా పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు పోలీసు బలగాలను మోహరించాలని ఆదేశించారు. ప్రజలు గోదావరి నదిలో స్నానాలు చేయడం, ఈత కొట్టడం, వరద నీటిలోకి వెళ్లడం, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం, వంతెనలు, కరకట్టల వద్దకు వెళ్లడం, చేపలు పట్టడం లేదా పడవల ద్వారా ప్రయాణించడం వంటి చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించిన కలెక్టర్, అత్యవసర పరిస్థితుల్లో 24×7 ఫ్లడ్ కంట్రోల్ రూమ్ (08744-241950) లేదా వాట్సాప్ నంబర్ 9392919743ను సంప్రదించాలని తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
