శాఖల మధ్య సమన్వయ లోపం... అధికారుల నిర్లక్ష్యం
- విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారిన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్
- రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నా పట్టించుకోని సంబంధిత శాఖలు దౌల్తాబాద్‌లో ప్రమాద ఘంటికలు
దౌల్తాబాద్, సిద్ధిపేట: చేగుంట దౌల్తాబాద్ ప్రధాన ఆర్అండ్‌బీ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ, శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది. దౌల్తాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో, రహదారిని ఆనుకొని ఉన్న 100 కేవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ముందుగా సురక్షిత ప్రాంతానికి తరలించి, అనంతరం రహదారి పనులు చేపట్టాలి. అయితే విద్యుత్ శాఖ, ఆర్అండ్‌బీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను యథాతథంగా ఉంచి పనులు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులు, కాలినడకన వెళ్లే ప్రజలు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నారు.
విద్యార్థుల ప్రాణాలపై ముప్పు
ఈ రహదారి వెంటనే దౌల్తాబాద్ మోడల్ పాఠశాల ఉండటంతో వందలాది మంది విద్యార్థులు ప్రతి రోజు కాలినడకన పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. అదే ప్రాంతంలో ఎస్సీ బాలుర వసతి గృహం కూడా ఉండటంతో హాస్టల్ విద్యార్థులు సైతం ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నారు. 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ రహదారికి అత్యంత సమీపంలో ఉండడం, రోడ్డు విస్తరణ పనుల వల్ల వాహనాల రద్దీ పెరగడం విద్యార్థులకు పెద్ద ప్రమాదంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
• శాఖల మధ్య సమన్వయం ఎక్కడ?
రోడ్డు విస్తరణ పనులను ఆర్అండ్‌బీ శాఖ నిర్వహిస్తుండగా, 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించే బాధ్యత విద్యుత్ శాఖపై ఉంది. అయితే రెండు శాఖలు పరస్పర సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల పనులు సక్రమంగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల భద్రత కంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికే ప్రాధాన్యం ఇస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
• అప్రమత్తం కాకపోతే అనర్థమే
ఈ ప్రాంతంలో ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, స్థానికులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టడం ప్రభుత్వ శాఖల బాధ్యత అని వారు పేర్కొంటున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


