ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
On
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో ప్రైవేటు హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గుతున్నట్టు ప్రైవేటు హాస్పిటళ్ల యజమానులు చెబుతున్నారని మంత్రి వెల్లడించారు.
మరోవైపు, ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసేందుకు డాక్టర్లు ఆసక్తి చూపుతున్నారని, ఇటీవల జరిగిన డాక్టర్ల రిక్రూట్‌మెంట్లతో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ మేరకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటళ్లు సహా వంద బెడ్లు కలిగిన అన్ని ప్రభుత్వ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో మంత్రి శనివారం సమావేశం నిర్వహించారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో హనుమంతు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్‌పర్సన్, డాక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు పడడంలో సూపరింటెండెంట్ల పాత్ర అత్యంత కీలకం అని మంత్రి అభినందించారు.
పేషెంట్లు తమ పెట్టుకున్న నమ్మకాన్నా కాపాడుకుంటూ, వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు, డాక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అందరిపై ఉందన్నారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
గత రెండున్నర సంవత్సరాల్లో సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు.. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది సహా అవసరమైన అన్ని విభాగాల్లో నియామకాలు చేపట్టామని, ఇంకా అవసరమున్న చోట్ల పోస్టుల భర్తీ కొనసాగుతోందన్నారు. అద్దె భవనాలు, పాత భవనాలు, ఇరుకు భవనాల్లో కొనసాగుతన్న హాస్పిటళ్ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించి ఇస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. అవసరమైన మెడిసిన్, సర్జికల్స్ అన్ని అందిస్తున్నామన్నారు.
ప్రభుత్వం అన్ని వనరులను అందిస్తున్న నేపథ్యంలో సేవల నాణ్యతలో లోపాలకు ఎలాంటి సాకులు చెప్పొద్దని సూపరింటెండెంట్లకు మంత్రి సూచించారు. ఏ అవసరం ఉన్నా జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్, శాఖ హెచ్‌వోడీ మొదలుకుని మంత్రి వరకూ అందరికీ సమాచారం చేరవేయాలని మంత్రి సూచించారు.
ప్రతి సూపరింటెండెంట్ తన హాస్పిటల్‌ను ఓన్ చేసుకోవాలని, రోగులు ఆసుపత్రిలో అడుగుపెట్టిన నాటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యవస్థను రూపొందించాలని మంత్రి సూచించారు. ప్రతి రోజు వార్డులను స్వయంగా సందర్శించి రోగులతో మాట్లాడాలని, వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు. పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, భోజన నాణ్యత, భద్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం, అనవసర గైర్హాజరు, రోగులను గంటలతరబడి వెయిట్ చేయించడం.. ట్రీట్‌మెంట్‌లో జాప్యం చేయడం వంటి అంశాలను సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.
అత్యవసర విభాగాలు, ఐసీయూలు, ప్రసూతి విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ యూనిట్లు, ల్యాబ్‌లు, బ్లడ్ బ్యాంకులు, రేడియాలజీ సేవలు 24 గంటలు సమర్థవంతంగా పనిచేసేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చే రోగులకు ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక వైద్య పరికరాలు వినియోగంలో ఉండేలా చూడాలని, పనిచేయని పరికరాలను వెంటనే మరమ్మతు చేయించాలని, మందుల కొరత, పరికరాల లోపం, మౌలిక సదుపాయాల సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని మంత్రి సూచించారు.
హాస్పిటళ్ల పనితీరును ఇకపై నిరంతరం సమీక్షిస్తామని, ఇందుకోసం డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఓపీ, ఐపీ సేవలు, శస్త్రచికిత్సలు, అత్యవసర సేవలు, మాతా-శిశు ఆరోగ్య సేవలు, రోగుల సంతృప్తి, పరిశుభ్రత, సేవల నాణ్యత వంటి సూచీల ఆధారంగా పనితీరును అంచనా వేస్తామని చెప్పారు. ఉత్తమ పనితీరు కనబరిచిన డాక్టర్లు, సిబ్బందిని ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Views: 0
About The Author

Tags:

Error on ReusableComponentWidget
Latest News
19 Jul 2026 00:48:51
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
