కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
దౌల్తాబాద్,సిద్ధిపేట: విద్యకు శ్రీకారం చుట్టే తొలి అడుగు అయిన అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కొనాయిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసం పట్ల ఆసక్తి కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి చిన్నారి విద్యావంతుడిగా ఎదగాలని, సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి వారి భవిష్యత్తు బంగారు బాటలో పయనించేలా చేయాలని సూచించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెహరాజ్ మాట్లాడుతూ, అక్షరాభ్యాసం అనేది విద్యారంభానికి ప్రతీక అని, చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సుకన్య, ఉప సర్పంచ్ శ్యామల, వార్డు సభ్యులు అక్షిత, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


