రూ.8 వేలకోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి
ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: గుజ్జ సత్యం హెచ్చరిక
ఎల్బీనగర్ : పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క, విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కళాశాలల బహిష్కరణ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించిందని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు గుజ్జ సత్యం అధ్యక్షతన కొత్తపేట శివాని కళాశాల వందలాది మంది విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కొత్తపేట చౌరస్తాలో ఆందోళన, నిరసన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, రాజ్యాంగబద్ధమైన విద్యా అవకాశాలను కల్పించే సామాజిక న్యాయ పథకమని స్పష్టం చేశారు. వేలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల భవిష్యత్తు ఈ పథకంపై ఆధారపడి ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత బాధాకరమన్నారు. ఇప్పటికే కళాశాలలకు వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో అనేక విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, మరోవైపు విద్యార్థులు ఫీజుల పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను హక్కుగా గుర్తించిన ప్రభుత్వం, అదే హక్కు అమలులో మాత్రం వెనుకడుగు వేయడం విరుద్ధమైన వైఖరని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు విద్యార్థుల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించలేకపోయాయని, పూర్తి స్థాయిలో పెండింగ్ బకాయిల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన విద్యార్థుల మహా ర్యాలీలు, కలెక్టరేట్ ఆర్డీవో ఎంఆర్ఓ కార్యాలయాల వరకు చేపట్టిన ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, బీసీ జాక్ స్టేట్ కో-ఆర్డినేటర్ గుజ్జ సత్యం తెలిపారు. విద్యార్థుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని, సమస్యను రాజకీయ కోణంలో కాకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరిష్కరించాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించడం, పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడం,14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టొద్దని, విద్యార్థులపై ఆర్థిక భారం మోపే విధానాలను ఉపసంహరించుకోవడం వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం కొనసాగుతుందని గుజ్జ సత్యం స్పష్టం చేశారు. అనంతరం మన ఆలోచన సాధన సమితి (మాస్) వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ.. "విద్యపై పెట్టుబడి పెట్టడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యతని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల పేద విద్యార్థుల ఉన్నత విద్య ప్రమాదంలో పడుతోందన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా నిధులు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుపై నమ్మకాన్ని పునరుద్ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ రఘురాంనేత, బీజేపీ రాష్ట్ర కన్వీనర్ కర్నాటి ధనంజయ, సోషల్ జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులు చామకూర రాజు, సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కేవీ గౌడ్, బీసీ నాయకులు బ్రహ్మయ్య, విద్యార్థి నాయకులు గుర్రం శ్రవణ్, లక్ష్మీనారాయణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యాసంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
01 Aug 2026 19:34:19
ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా మొత్తం 314 మంది చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు....
