దోసపహాడ్ వీధి దీపాల వివరాలపై 'సమాచార' ఆరా!
- ఎంపీడీఓ కార్యాలయంలో అర్జీ సమర్పణ
- దోసపహాడ్ గ్రామానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని వినతి
పెన్ పహాడ్,( సూర్యాపేట): సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామంలో గత కొంతకాలంగా చేపట్టిన వీధి దీపాల ఏర్పాటు, వాటి ఖర్చులకు సంబంధించిన వివరాలను కోరుతూ బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు నమోదైంది.గ్రామానికి చెందిన సద్దల నాగేశ్వర్ అనే దరఖాస్తుదారుడు ఈ అర్జీని సమర్పించారు. గ్రామంలో ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్) బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు వీధి స్తంభాలకు ఏర్పాటు చేసిన కొత్త ఎల్‌ఈడీ బల్బులు, ఫ్రేముల వివరాలను వీధుల వారీగా తెలియజేయాలని ఆయన కోరారు.అదేవిధంగా, ఈ కొనుగోళ్లకు సంబంధించిన అంచనాలు, టెండర్లు, బిల్లులు, వోచర్ల కాపీలతో పాటు, ఏ నిధుల నుండి ఈ ఖర్చులు చేశారనే సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందించాలని దరఖాస్తులో పేర్కొన్నారు. తాను దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నందున, చట్టంలోని సెక్షన్ 7(5) ప్రకారం ఫీజు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తన తెల్ల రేషన్ కార్డు ప్రతిని దరఖాస్తుకు జతపరిచినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండేటి బిక్షం రెడ్డి, మల్లేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


