రైతు బీమా క్లెయిమ్‌లకు దరఖాస్తుల స్వీకరణ
- అర్హులైన రైతుల కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలి
- మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్
మర్పల్లి, (వికారాబాద్): మండలంలో రైతులు రైతు బీమా పథకం కింద అర్హులైన రైతుల మరణాలకు సంబంధించి బీమా క్లెయిమ్‌ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 14, 2026 నుంచి సంభవించిన అర్హులైనరైతుల మరణాల వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల దృష్టికి తీసుకువచ్చి, క్లెయిమ్ కోసం అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2025–26 పాలసీ సంవత్సరంలో రైతు బీమా పథకంలో నమోదు అయి, 2026–27 పాలసీ సంవత్సరానికి అర్హత కలిగిన రైతుల మరణాలకే ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు.క్లెయిమ్ కోసం మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ తదితర అవసరమైన పత్రాలను సమర్పించాలని సూచించారు. దరఖాస్తులు, పత్రాలను పరిశీలించిన అనంతరం అర్హులైన కేసులను రైతు బీమా పోర్టల్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు.
కొత్త పట్టాదారు పాస్‌బుక్ ఉంటే అర్హత లేదు
కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు ఈ పథకం కింద క్లెయిమ్‌కు అర్హులు కారని స్పష్టం చేశారు. రైతు వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలని, అర్హత నిబంధనలకు లోబడి ఉన్న కేసులను మాత్రమే నమోదు చేస్తామని తెలిపారు.అర్హులైన రైతు కుటుంబాలు ఎలాంటి జాప్యం చేయకుండా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


