ప్రతిపక్ష గొంతును అణచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం

బీఆర్‌ఎస్ మ్మెల్యే సభ్యుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలి : ఎం.డి. జానీ

ప్రతిపక్ష గొంతును అణచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం

 

 

మల్లంపల్లి (ములుగు): ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపక్ష సభ్యులను శాసనమండలి నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఎం.డి. జానీ అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను సస్పెన్షన్‌ పేరుతో అణచివేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.చట్టసభలు ప్రజా సమస్యలపై చర్చించే వేదికలని, అధికార పక్షాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష సభ్యులకు ఉందని అన్నారు. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించినప్పుడు వాటిపై సమాధానం ఇవ్వడం, పరిష్కార మార్గాలను చూపడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం ప్రజాస్వామ్యంలో సహజమని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఎం.డి. జానీ సూచించారు. సభ్యులను సస్పెండ్ చేయడం వల్ల ప్రజా సమస్యలకు పరిష్కారం లభించదని అన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కల్వకుంట్ల తారక రామారావు, అనిల్ జాదవ్, తన్నీరు హరీశ్ రావు, గుంతకట్ల జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరావు కృష్ణారావు, గోమా లక్ష్మి, మాణికరావు, చింత ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తదితరులు ప్రతిపక్ష తరఫున ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల గొంతును సభలో వినిపించకుండా చేయడం సరైన ప్రజాస్వామ్య పద్ధతి కాదని అన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పరం గౌరవించుకుంటూ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు.సభా గౌరవం, నియమ నిబంధనలను కాపాడటంతో పాటు ప్రతిపక్ష సభ్యుల హక్కులను కూడా గౌరవించాలని ఎం.డి. జానీ కోరారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, సస్పెన్షన్‌ను పునఃపరిశీలించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags: