అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లపై ఎస్పీ ఆకస్మిక తనిఖీ
- విజిబుల్ పోలీసింగ్‌కు పెద్దపీట.. రాత్రి గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశాలు
- సీసీ కెమెరాలపై నిఘా.. అనుమానాస్పద కదలికలపై తక్షణ స్పందనకు సూచనలు
కొత్తగూడెం : ప్రజలకు పోలీసుల భద్రతా సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా విజిబుల్ పోలీసింగ్‌పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మంగళవారం అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ.. రాత్రి వేళల్లో పోలీసుల పనితీరు, గస్తీ విధానాలు, సిబ్బంది అందుబాటులో ఉండే పరిస్థితులను పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి సీసీ కెమెరాల ద్వారా కొనసాగుతున్న నిరంతర పర్యవేక్షణను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అనుమానాస్పద కదలికలు, ఘటనలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారులకు తక్షణమే సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. అలర్టింగ్ అధికారులు, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ రాత్రి వేళల్లో పోలీసుల నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
రాత్రి గస్తీపై ప్రత్యేక దృష్టి
రాత్రి సమయంలో పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ప్రధాన రహదారులతో పాటు జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ పోలీసుల విజిబిలిటీ పెంచాలని సూచించారు.
రౌడీషీటర్ల కదలికలపై నిఘా
సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత వ్యక్తుల కదలికలు, కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
112 కాల్‌కు తక్షణ స్పందన
డయల్-112కు ఫోన్ వచ్చిన వెంటనే సంబంధిత సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు త్వరితగతిన సహాయం అందించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, రాత్రింబవళ్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేలా విజిబుల్ పోలీసింగ్‌ను మరింత విస్తృతం చేయాలని ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


