కానరాని సమాచార హక్కు చట్టం బోర్డు
- బిజినేపల్లి విద్యుత్ శాఖలో అధికారుల నిర్లక్ష్యం
నాగర్ కర్నూల్, /బిజినేపల్లి: సామాన్యుడికి వజ్రాయుధం లాంటి సమాచార హక్కు చట్టం-2005 అమలులో బిజినేపల్లి మండల విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ చట్టానికి సంబంధించిన వివరాలను ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాల్సి ఉండగా, బిజినేపల్లి మండల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆర్టీఐ సమాచార బోర్డు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం తమ కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్య సమాచారం, పౌర సమాచార అధికారి పేరు, ఫోన్ నంబర్, అప్పిలేట్ అధికారి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రదర్శించాలి. నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ సమస్యలపై కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్న తరుణంలో ఆర్టీఐ బోర్డు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించాల్సిన అధికారులే బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ శాఖల నుంచి తమకు అవసరమైన సమాచారాన్ని చట్టబద్ధంగా పొందే హక్కు ప్రజలకు ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే బిజినేపల్లి మండల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆర్టీఐ బోర్డును ఏర్పాటు చేసి, పీఐఓ, అప్పిలేట్ అధికారుల పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు అమలు చేయని అధికారులపై ఉన్నతాధికారులు, సమాచార కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


