కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పోరుకు అసెంబ్లీ వేదికా?
- ప్రజా సమస్యలు గాలికి.. రాజకీయ రగడలకు పెద్దపీట!
- ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని జనసేన డిమాండ్
కొత్తగూడెం : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను పక్కనబెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర విమర్శలు, పక్కదారి రాజకీయాలకు పాల్పడుతున్నాయని జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాల్సిన చట్టసభలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదని పేర్కొంటూ నిరసన తెలిపారు. జనసేన పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి డా. గడల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు సెంటర్‌లో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 22-ఏలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అవినీతిని అరికట్టి పారదర్శక పాలన అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్–బీఆర్‌ఎస్ వర్గపోరుకు అసెంబ్లీని అడ్డాగా మార్చొద్దని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చట్టసభల్లో సమగ్రంగా చర్చ జరగాలని అన్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రజా సమస్యలను పక్కనబెట్టి పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలయాపన చేయడం తగదన్నారు. తెలంగాణకు కావాల్సింది రాజకీయ నాటకాలు కాదు.. ప్రజాపాలన అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సాధిక్ పాషా, మోదుగు జోగారావు, పుదారి శ్యామ్, అంజి నాయుడు, రాము, సాంభ, సాయి, సంపత్, పాషా, రమేష్, బాలకృష్ణ, పులి, పండు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


