మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: నగరంలోని మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం చేపట్టిన ఈ పర్యటనలో ట్యాంక్ పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సీఎం స్వయంగా పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా ప్రతిపాదిత ప్రణాళికలు, పనుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు మీరాలం ట్యాంక్‌ను అత్యుత్తమ డిజైన్లు, ఆధునిక సౌకర్యాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రణాళికలను పూర్తిగా పరిశీలించిన అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం ఓపెన్-టాప్ జీపులో ప్రయాణిస్తూ పరిశీలించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను కూడా స్వయంగా పరిశీలించారు. భారీ క్రేన్ సహాయంతో పైకి వెళ్లి బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన చూశారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెరువు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాను విస్తరించాలని సూచించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మీరాలం ట్యాంక్‌ను పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు వాటర్ స్పోర్ట్స్‌కు అనువుగా డిజైన్ చేయాలని సీఎం సూచించారు. చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్‌లను సుందరీకరించి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో మీరాలం ట్యాంక్ ఉన్నందున, నగరానికి వచ్చే దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా మొత్తం పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణకు సమ ప్రాధాన్యం ఇస్తూ మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటన సందర్భంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


