నేటితో కేసీఆర్ సర్కారు ప్రజారంజక పాలనకు పదేళ్లు
- నిజామాబాద్ లో దశాబ్ది పండుగకు భారీ ఏర్పాట్లు
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
నిజామాబాద్ :బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆవిష్కృతమైన స్వర్ణయుగం గురించి మననం చేసుకోవడానికి శుక్రవారం నిజామాబాద్ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున పదేళ్ల పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ నగరంలోని బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరగనున్న పదేళ్ల పాలన వేడుకల్లో బీ ఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ, పాలనా ప్రస్థానాలను ఒక సారి నెమరువేసుకొని ఉద్యమ కారులుగా తమ అనుభవాలను భావితరాలతో పంచుకుంటామని జీవన్ రెడ్డి వివరించారు. ఉద్యమ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, కవులు, కళాకారులు, జేఏసి నాయకులను ఈ సందర్భంగా సత్కరిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్,షకీల్ ఆమేర్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, బాజిరెడ్డి జగన్,మాజీ మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు. కావున నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,సీనియర్ నాయకులు,ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు ,మహిళలు,యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ పదేళ్ల పండుగను విజయవంతం చేయాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


