కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి.... విద్యాశాఖ కమిషనర్ యోగితా రానా
ఆదిలాబాద్ బ్యూరో : విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజీబీవీ) జూనియర్ కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వసతి గృహం, వంటగది, భోజన ప్రదేశం, పరిసరాలను పరిశీలించి విద్యార్థినులకు అందుతున్న మౌలిక వసతులు, విద్యాబోధన, వసతి, భోజనం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి చదువు, భోజనం, వసతి సదుపాయాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థినులు లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని యోగితా రాణా సూచించారు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులు, అధికారుల దృష్టికి ధైర్యంగా తీసుకురావాలని అన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఆమె, భోజనం నాణ్యత, రుచిని పరిశీలించారు. ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. వంటగది, భోజన ప్రదేశం, పరిసరాల్లో పరిశుభ్రతను నిరంతరం పాటించాలని, ఆహారం తయారీ, నిల్వ, వడ్డింపులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మంద మకరంద్, విద్యాశాఖ అధికారి మాధవి, కళాశాల ప్రిన్సిపల్ దీప్తి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


