బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఆహార మహోత్సవం’
బిచ్కుంద, : బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ (స్వయంప్రతిపత్తి) కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘ఆహార మహోత్సవం’ (ఫుడ్ ఫెస్టివల్)ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల సాంప్రదాయ, నాణ్యమైన వంటకాలతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రదర్శనతో పాటు విక్రయాలు చేపట్టారు. వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వంటకాలు, రుచికరమైన ఆహార పదార్థాలు విద్యార్థులు ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయడంతో కళాశాల విద్యార్థులు, అధ్యాపకుల నుంచి విశేష స్పందన లభించింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ మాట్లాడుతూ, ఫుడ్ ఫెస్టివల్ అనేది కేవలం ఆహారాన్ని ఆస్వాదించే కార్యక్రమం మాత్రమే కాదని, విభిన్న సంస్కృతులు, వివిధ ప్రాంతాల రుచులు, మానవ సంబంధాలను ఒకే వేదికపై కలిపే గొప్ప కార్యక్రమమని అన్నారు.ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సమన్వయంతో పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. అంతేకాకుండా స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించడం ద్వారా భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగడానికి అవసరమైన ప్రాథమిక అవగాహన, ఆత్మవిశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారు.మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త వై. రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు దొంప్రెవార్ సంగమేశ్వర్, కిరణ్ నిరుడి, జాదవ్ శ్రీనివాస్తో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


