చెంచు సంస్కృతికి అద్దం పట్టనున్న చెంచులక్ష్మి మ్యూజియం
నాగర్ కర్నూల్,: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మన్ననూర్‌లో నిర్మాణంలో ఉన్న చెంచులక్ష్మి మ్యూజియం అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సంయుక్తంగా పరిశీలించారు. అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. చెంచుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా మ్యూజియాన్ని సాంస్కృతిక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. చెంచు సమాజానికి చెందిన అరుదైన వస్తువులు, సంప్రదాయ పరికరాలను ప్రదర్శించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమాచారాన్ని సందర్శకులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. మ్యూజియం ప్రాంగణంలో మౌలిక వసతులు మెరుగుపరచి పనులు త్వరగా పూర్తి చేసి సందర్శకులకు అందుబాటు లోకి తేవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, చెంచు సంస్కృతి, సంప్రదాయాలు విలువైన వారసత్వ సంపద అని, నల్లమల్ల-అమ్రాబాద్ ప్రాంతానికి ప్రకృతి, అటవీ సంపద, చెంచు సంస్కృతితో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మ్యూజి యాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలని, పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, చెంచు సమాజ ఆర్థికాభివృద్ధికి పర్యాటకం దోహదపడుతుందని తెలిపారు. మ్యూజియం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


