మీడియా రంగానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. : ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
- వాస్తవ, విశ్వసనీయ సమాచారమే జర్నలిస్టుల లక్ష్యం కావాలి
- తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్ : సమాజంలో నెలకొన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ, విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీసీ హాల్‌లో విలేకరులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వార్తల సేకరణ, వాస్తవ నిర్ధారణ, విశ్లేషణ, రచన, ప్రసారం వంటి ప్రతి దశలో జర్నలిస్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని శ సూచించారు. సోషల్ మీడియా ద్వారా సమాచారం క్షణాల్లో విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. వార్తను వేగంగా అందించడం కంటే, వాస్తవాలను నిర్ధారించి బాధ్యతాయుతంగా ప్రజలకు అందించడం ముఖ్యమని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలకు తావులేకుండా ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడమే పాత్రికేయుల ప్రధాన బాధ్యతగా ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్థంభంగా ప్రజల తరఫున గొంతుకగా నిలుస్తోందని చైర్మన్ పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సేవల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో స్థానిక విలేకరుల పాత్ర అభినందనీయమన్నారు. వార్తలో వేగం కంటే వాస్తవికత, విశ్వసనీయత, బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. మారుతున్న మీడియా అవసరాలకు అనుగుణంగా జర్నలిస్టులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి అకాడమీ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని చైర్మెన్ తెలిపారు. రెండు రోజుల శిక్షణలో అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, నిపుణులు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారని చెప్పారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు వృత్తి నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ హితం కోసం నిరంతరం పనిచేసే జర్నలిస్టుల పాత్ర ఎంతో ప్రాధాన్యమైనదని అన్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంలో, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్న తీరును తెలియజేయడంలో మీడియా కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. వాస్తవాలను ఆధారంగా చేసుకుని వార్తలను అందిస్తూ సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో వార్తా సేకరణలో నూతన పద్ధతులు, వార్తల వాస్తవ నిర్ధారణ, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వినియోగం, పాత్రికేయ నైతిక విలువలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, జర్నలిజంలో ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై నిపుణులు విలేకరులకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వేంకటేశ్వరరావు, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి, డీపీఆర్వో విష్ణు వర్ధన్, మీడియా అసోసియేషన్ ప్రతినిధులు రాజేశ్వర్, దేవేందర్, బేత రమేష్, వినోద్, నవనందుల నర్సయ్య, కే గజానన్, ఆకుల కార్తీక్,సురేష్, సుభాష్, కిరణ్ తదితరులతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


