అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?
- మూడో విడత ప్రక్రియపై స్పష్టత కరవు..
- కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టుల ఆవేదన..
- కమిటీ సమావేశం కోసం ఎదురుచూపులు
కొత్తపల్లి : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుండగా.. కరీంనగర్ జిల్లాలో మూడో విడత ప్రక్రియపై ఇంకా స్పష్టత లేకపోవడంపై జర్నలిస్టుల్లో ఎదురుచూపులు నెలకొన్నాయి. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో పలువురు జర్నలిస్టులకు కార్డులు జారీ కాగా, మూడో విడతకు సంబంధించిన ప్రక్రియపై మరింత స్పష్టత రావాల్సి ఉందని జర్నలిస్టులు కోరుతున్నారు. అర్హత ఉన్నప్పటికీ కార్డులు అందని జర్నలిస్టుల విషయంలో కమిటీ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అక్రిడిటేషన్‌కు అర్హత ఉన్న పలువురు జర్నలిస్టులు ఇప్పటికే కమిటీ సభ్యులను సంప్రదించినట్లు చెబుతున్నారు. ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని సమాధానం వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు సమావేశం నిర్వహించకపోవడానికి కారణమేంటని వారు ప్రశ్నింస్తున్నారు. ఇతర జిల్లాల్లో ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలో కరీంనగర్‌లో ఎందుకు జాప్యం జరుగుతోందనే దానిపై కమిటీ సభ్యులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో విడత అక్రిడిటేషన్ ప్రక్రియకు సంబంధించి కమిటీ సమావేశం నిర్వహించే తేదీ, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, కార్డుల జారీకి సంబంధించిన తదుపరి చర్యలపై స్పష్టత ఇవ్వాలని జర్నలిస్టులు కోరుతున్నారు. అర్హత కలిగిన జర్నలిస్టుల దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కమిటీ సమావేశం అనంతరం మూడో విడత కార్డుల జారీపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


