పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పోలీసింగ్‌ను మరింత వేగవంతంగా , పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ , ప్రొఫెసర్లు , ఫ్యాకల్టీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏ విధంగా అనుసంధానం చేయాలి , పోలీసింగ్‌లో ఏఐ ఆధారిత సాంకేతికతను ఏయే రంగాల్లో వినియోగించుకోవచ్చు అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రత్యేకంగా నేరాల విశ్లేషణ , నేరాల నివారణ , క్రైమ్ డేటా విశ్లేషణ , అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపు , ట్రాఫిక్ నిర్వహణ , సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణ , సైబర్ నేరాల దర్యాప్తు , సోషల్ మీడియా మానిటరింగ్ , ప్రజలకు పోలీస్ సేవలను మరింత వేగంగా అందించడం వంటి అంశాల్లో ఏఐ సాంకేతికతను వినియోగించుకునే అవకాశాలపై సమీక్షించారు. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అవసరమైన శిక్షణ , సాంకేతిక నైపుణ్యాల పెంపు , కళాశాలల్లో అందుబాటులో ఉన్న సాంకేతిక నిపుణుల సహకారంతో పోలీస్ శాఖకు ఉపయోగపడే ఏఐ ఆధారిత పరిష్కారాలు , సాఫ్ట్‌వేర్‌లు మరియు అప్లికేషన్ల అభివృద్ధి వంటి అంశాలపై కూడా చర్చించారు. విద్యాసంస్థలు , సాంకేతిక నిపుణులు మరియు పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ప్రజా భద్రతకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు , భవిష్యత్ పోలీసింగ్‌ను సాంకేతికత ఆధారితంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో , పోలీస్ శాఖ కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని నేర నియంత్రణ , దర్యాప్తు , ప్రజా భద్రత మరియు పోలీస్ సేవలలో మరింత సమర్థవంతమైన ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో నవ్య భారతి జాయింట్ సెక్రెటరీ డాక్టర్ శిరీష్ , విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.స్వప్న , ఫ్యాకల్టీ సుజాత, నవ్య, లక్ష్మి , కాకతీయ కాలేజీ కిడ్స్ అధికారులు డి.వేణుగోపాల్ పి. నాగార్జున , క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ సి.ఓ.డి ఎం. లక్ష్మణ్ మరియు సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


