జర్నలిస్టుల పక్షాన పోరాడేది టీజేయూనే.
నాయకుల ఎదుగుదల కాదు.. జర్నలిస్టుల అభ్యున్నతే టీజేయూ లక్ష్యం: బింగి స్వామి
జిన్నారం, : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయూ) అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి అన్నారు. ఇతర సంఘాలు నాయకుల ఎదుగుదలపై దృష్టి పెడితే.. టీజేయూ మాత్రం జర్నలిస్టుల ఎదుగుదల, సంక్షేమం కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. జిన్నారం మండల నూతన కమిటీ ఏర్పాటుకు ముఖ్యఅతిథిగా హాజరైన బింగి స్వామి మాట్లాడుతూ జర్నలిస్టుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేదన్నారు. సమాజంలో ప్రజా సమస్యల ను వెలుగులోకి తీసుకువచ్చే ప్రతి జర్నలిస్టు ముఖ్యుడేనని తెలిపారు. అక్రమాలు, భూ కబ్జాలు, అవినీతి వంటి సమస్యలను ధైర్యంగా వెలికితీసే వారే నిజమైన పెద్ద రిపోర్టర్లని అన్నారు. జర్నలిస్టులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరి ముందు తలవంచాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంలో పూర్తిగా విఫలమైందని బింగి స్వామి విమర్శించారు. జర్నలిస్టుల మద్దతుతోనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యల ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిన్నారం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అన్నారం వెంకటేష్‌ను ఎన్నుకుని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల ఐక్యతే బలం: దేవులపల్లి ఎల్లయ్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. అక్రిడిటేషన్ ఉన్నవారే జర్నలిస్టులు అనే విధానం సరికాదని, గుర్తింపు కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టును ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, పిల్లలకు ఉచిత విద్య వంటి సంక్షేమ సదుపాయాలు కల్పించాలని కోరారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం పునరావృతం చేయకుండా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం. గిరి, ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు పోచ గౌడ్, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తూర్పుంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


