శిరీష హత్య కేసులో ప్రైమ్ కేర్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి
- హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే దారుణం జరిగింది
- తెలంగాణ రక్షణ సేన నాయకుల డిమాండ్
నిజామాబాద్: ఆదివాసీ బిడ్డ ఊకె శిరీష దారుణ హత్య ఘటనలో ఆమె పనిచేస్తున్న శంషాబాద్ లోని తుక్కుగూడ ప్రైమ్ కేర్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. హాస్పిటల్ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే ఆమె హత్య జరిగిందని తెలిపారు. ఆదివారం శంషాబాద్ డీసీపీ ఆఫీస్ లో పార్టీ నాయకులతో కలిసి ఊకె శిరీష హత్య ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ, శిరీష హత్యకు కారణమైన ప్రైమ్ కేర్ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేసి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత కొన్ని రోజుల క్రితం ములకలపల్లి మండలంలోని చౌటిగూడెంలో ఊకె శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ బిడ్డ హత్యకు హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే ఆమె కుటుంబ సభ్యులు వివరించారని తెలిపారు. శిరీష కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు హాస్పిటల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆదివాసీ బిడ్డ శిరీష మృతితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు వెంటనే హాస్పిటల్ ను సీజ్ చేయాలని కోరారు. తమ పార్టీ అధ్యక్షులు కవిత శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలోనే సీఎం స్పందించి శిరీష మరణంపై విచారణకు జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్టు ప్రకటించినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు ప్రారంభం కాలేదన్నారు. ఆదివాసీ యువతి హత్య విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి, ఆదివాసీ విభాగం నాయకుడు లోకిని రాజు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నవీన్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గ ఇంఛార్జ్ కోల శ్రీనివాస్, పార్టీ నాయకురాలు భవాని తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


