డీజేలకు అనుమతి లేదు
- -భక్తి, భద్రత, క్రమశిక్షణతో గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి
- -మండపాల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరి
- -మండప నిర్వాహకులతో సమన్వయ సమావేశంలో డీసీపీ బి. రామ్‌రెడ్డి
గోదావరిఖని: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలో డీజేలు వినియోగించరాదని పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డీజేలపై నిషేధం అమల్లో ఉందన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కోదండ రామాలయంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏసీపీ ప్రవీణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. గోదావరిఖని ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తూ, సూచనలు, నిబంధనలు పాటిస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ ఐకమత్యంతో జీవిస్తున్నారని తెలిపారు. అందుకే గోదావరిఖనికి ‘మినీ మాంచెస్టర్’గా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అదే స్ఫూర్తితో గణేశ్ నిమజ్జనాన్ని కూడా అందరూ కలిసి ప్రశాంతంగా, ఆనందంగా నిర్వహించాలని కోరారు. నిమజ్జన శోభాయాత్రను వీలైనంత త్వరగా ప్రారంభించి, సాయంత్రం 5 లేదా 6 గంటల్లోపు ప్రధాన చౌరస్తాకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని డీసీపీ సూచించారు. అక్కడి నుంచి గోదావరి వంతెన వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశానికి క్రమపద్ధతిలో వెళ్లాలన్నారు. పోలీసుల సూచనలు, మైక్ ద్వారా చేసే ప్రకటనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి 10 గంటల్లోపు కార్యక్రమాలు ముగించాలని, మద్యం, పేకాట, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావివ్వకూడదన్నారు. ఇతర మతాలను కించపరిచే వ్యాఖ్యలు, పాటలు ప్రసారం చేయరాదని తెలిపారు. భక్తి, భద్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని డీసీపీ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


