అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.
- రేషన్ షాపుల్లో 14 రకాల సరుకులు పంపిణీ చేయాలి
- సీపీఎం ఆధ్వర్యంలో పటాన్‌చెరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
పటాన్‌చెరు : పటాన్‌చెరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే. రాజయ్య డిమాండ్ చేశారు. రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో పటాన్‌చెరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కే. రాజయ్య మాట్లాడుతూ పటాన్‌చెరు, రామ చంద్రాపురం, బీరంగూడ, అమీన్‌పూర్ తదితర ప్రాంతాల్లో వేలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నెలకు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు అద్దెలు చెల్లిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో కొల్లూరు, అమీన్‌పూర్, బీరంగూడ, ముత్తంగి, నాగులపల్లి, కర్దనూర్, పోచారం, చిట్కుల్, కొడకంచి తదితర ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదా యాలను నిర్మించిందని, అయితే కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తికాక మధ్యలోనే నిలిచిపోయాయని పేర్కొన్నారు. నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పటాన్‌చెరు, రామచంద్రాపురం, బీరంగూడ ప్రాంతాలకు చెందిన వేలాది మంది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని లబ్ధిదారుల జాబితాల్లో పేర్లు ఉన్నప్పటికీ ఇళ్ల కేటాయింపులో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులను అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం సరికాదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.అలాగే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న పలువురు లబ్ధిదారులకు రావాల్సిన నిర్మాణ బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ‘ఇందిరమ్మ టవర్స్’ పథకానికి సంబంధించి పటాన్‌చెరు నియోజకవర్గంలో విధివిధానాలను స్పష్టంగా ప్రకటించి, లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయడంతో పాటు రేషన్ షాపుల్లో 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి బి. నాగేశ్వరరావు, ఏరియా కమిటీ సభ్యులు ఎం.డి. వాజిద్ అలీ, పి. పాండురంగారెడ్డి, సీపీఎం నాయకులు చంద్రకిరణ్ సింగ్, లఖాన్, సదాశివరెడ్డి, సురేందర్, జయరాం, మార్క్స్‌నగర్ అర్జున్, సంతోష్, ఇమ్మానియేల్ బాబు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


