గురువులదే దేశ భవిష్యత్తుకు అసలైన పునాది..
సమాజంలో అన్ని రంగాల అభివృద్ధికి గురువులే అద్యులు
- తల్లిదండ్రులతో సమానమైన దైవిక స్థానం ఉపాధ్యాయులదే
- బడ్జెట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ సిబ్బందిలో 80 శాతం మంది మహిళలే
- B - SMAT ద్వారా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 60 ప్రవేట్ పాఠశాలల ద్వారా 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య
- కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ పాఠశాలలు విద్యా వ్యాప్తి చేస్తున్నాయి
- ప్రతి స్కూల్ నుండి ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇద్దరు ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం అభినందనీయం
- బడ్జెట్ స్కూల్ యాజమాన్యాల కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎల్లవేళలా కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటాను
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ : సమాజ నిర్మాణంలోఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనదని, తల్లిదండ్రులతో పాటు గురువులకు కూడా సమాజంలో అత్యున్నత స్థానం ఉందని బల్కొండ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మోర్తాడ్ మండల కేంద్రం RNB ఫంక్షన్ హాల్ లో B-SMAT ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘గురు పూజోత్సవం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తులు కాదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులని ఆయన అభివర్ణించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ తరహాలోనే ఆచార్య దేవోభవ అని మన సమాజం భావిస్తుందని గుర్తుచేశారు. ఒక చిన్నారి పాఠశాలలో చేరినప్పుడు ప్రపంచం గురించి ఎలాంటి అవగాహన ఉండదని, అలాంటి పసిమనసులకు క్రమశిక్షణ, జ్ఞానం మరియు నడతను నేర్పించే గురువులు విద్యార్థుల జీవితంలో చెరగని ముద్ర వేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజంలో శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, చివరికి సీఎంలు, పీఎంలు అయిన వారందరూ ఎవరో ఒక ఉపాధ్యాయుని వద్ద చదువు నేర్చుకున్నవారేనని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఒక రంగానికి పరిమితం చేయలేమని, అన్ని రంగాలకు ఆద్యుడు గురువేనని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా బడ్జెట్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మరియు బడ్జెట్ పాఠశాలల వ్యవస్థపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వాలు చదువు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను కలిగి ఉంటాయని అన్నారు. అయితే, మన దేశంలో 40 నుంచి 50 శాతం మాత్రమే ప్రభుత్వాల ద్వారా విద్యారంగం అందుబాటులో ఉంటోందని, మిగతా 50 నుంచి 60 శాతం విద్యారంగాన్ని ప్రైవేట్ రంగమే మోస్తోందని చెప్పారు. ఇది ఎవరూ కాదనలేని సత్యమని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలోనూ రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయని, ఒకటి భారీ కార్పొరేట్ విద్యా వ్యవస్థ కాగా, రెండోది మధ్య, దిగువ మధ్యతరగతి పిల్లల కోసం సేవలందిస్తున్న బడ్జెట్ పాఠశాలల వ్యవస్థ అని అన్నారు.కార్పొరేట్ స్కూల్స్ కేవలం డబ్బున్న వారికే అందుబాటులో ఉంటాయని, కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థులకు మాత్రం ఈ బడ్జెట్ పాఠశాలలే విద్యను అందిస్తున్నాయని అన్నారు. బడ్జెట్ స్కూల్స్ వ్యవస్థ కేవలం ఒక వ్యాపారంగా కాకుండా, తాము బతుకుతూ మరో పది మంది ఉపాధ్యాయులను బతికిస్తూ సమాజానికి సేవ చేసే వ్యవస్థగా కొనసాగుతోందని ప్రశంసించారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ పాఠశాలలు విద్యా వ్యాప్తి చేస్తున్నాయి.ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ మరియు నాన్-టీచింగ్ స్టాఫ్‌లో దాదాపు 80 శాతం మంది మహిళలే ఉన్నారని, వీరి కుటుంబాల నిర్వహణలో ఈ ఉపాధ్యాయ వృత్తి ఎంతగానో దోహదపడుతోందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ పరిధిలో సుమారు 60 పాఠశాలలు ఉండగా, వాటిలో 30 వేల మంది విద్యార్థులువిద్యనభ్యశిస్తున్నారని , అలాగే 2,500 నుండి 3,000 మంది వరకు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది ఉపాధి పొందుతున్నారని వెల్లడించారు. ప్రతి పాఠశాల నుంచి ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి 'బెస్ట్ టీచర్' అవార్డులతో సత్కరించడం అభినందనీయమని, ఈ రకమైన ప్రశంసలు ఉపాధ్యాయుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడితేనే సమాజం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని, ఆ గొప్ప భవిష్యత్తుకు ఉపాధ్యాయులే అసలైన పునాది అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాను ఎల్లప్పుడూ బడ్జెట్ స్కూల్స్ అసోసియేషన్‌కు, ఉపాధ్యాయులకు ఒక కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక అలరించాయి. ఈ సందర్బంగా చిన్నారులను ఎమ్మెల్యేర్ అభినందించారు ఈ కార్యక్రమంలో B - SMAT రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి శేఖర్ రెడ్డి,ఫౌండర్ షఫీ, జిల్లా అధ్యక్షులు నంబుల గిరి,సెక్రటరీ రవీందర్, కోశాధికారి హరీష్ మరియు B - SMAT పాఠశాలల మేనేజ్మెంట్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


