ముస్లిం సంతుష్టీకరణ కోసమే రేవంత్ ప్రభుత్వం
- సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు.
- -బీజేపీ జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ : నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వ హించిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలోనూ అధికారికంగా నిర్వహించా లని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కోసమే సెప్టెంబర్ 17 వేడుకలను నిర్వహించకుండా చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ‘రేవంత్ ఉద్దీన్’లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రజాకార్ల హయాంలో సాగిన బలవంతపు మతమార్పిడులు, రామ్‌జీ గోండ్ సహా వెయ్యి మందిని ఉరితీసిన నిర్మల్ ఉదంతం, వల్లాలలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన పది మంది బడిపిల్లల హత్య, గుండ్రంపల్లి బావిలో 200 మందిని ఊచకోత కోసిన అకృత్యాలను ఆయన గుర్తుచేశారు. కొమురం భీమ్, దొడ్డి కొమరయ్య వంటి వీరుల త్యాగాలతో పాటు సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ సంకల్పం, ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్యల ఫలితంగానే తెలంగాణ విముక్తి సాధించి భారతదేశంలో విలీనమైందన్నారు. రజాకార్లు, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే దుష్ట చతుష్టయం మరియు కుటుంబ పాలన నుంచి తెలంగాణకు పూర్తి విమోచన లభించాలని పేర్కొన్నారు.సెప్టెంబర్ 17ను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా జరపాలని, హైదరాబాద్ నడిబొడ్డున సర్దార్ పటేల్ భారీ విగ్రహం, ప్రపంచస్థాయి మ్యూజియం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో అమరుల స్మారక కేంద్రాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. భైరాన్‌పల్లి, పరకాల వంటి పోరాట గ్రామాల్లో స్మారక స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఈ చరిత్రను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని, విమోచన పోరాట ప్రాంతాలతో టూరిజం సర్క్యూట్ రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్ కార్ లక్ష్మీనారాయణ, ప్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, న్యాలం రాజు, పద్మరెడ్డి, బొబ్బిలి వేణు గోపాల్, పొతుల పురుషోత్తం, జగన్ రెడ్డి, ఆనంద్, శంకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


