గణేష్ పండుగ నేపథ్యంలో అర్ధరాత్రి వేళ నగరంలో పోలీస్ కమిషనర్ ఆకస్మిక పర్యవేక్షణ
నిజామాబాద్ : గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. ప్రత్యేక దృష్టి సారించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాలను అర్ధరాత్రి వేళ స్వయంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు , పోలీస్ సిబ్బంది విధులు , ట్రాఫిక్ పరిస్థితులు , ప్రజల రాకపోకలు , రాత్రి వేళ భద్రతా చర్యలు తదితర అంశాలను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ముఖ్యంగా గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా రాత్రి వేళల్లో భక్తులు , యువత అధిక సంఖ్యలో సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని , ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డీజేలు , అధిక శబ్దం , రోడ్లపై అనవసరంగా గుంపులు చేరడం , మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గణేష్ ఉత్సవాలు , నిమజ్జనం కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ శాఖ పగలు , రాత్రి నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోందని , శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నగరంలోని పూలాంగ్, ఆర్.ఆర్ చౌరస్తా , ఖిల్లా చౌరస్తా , బోధన్ బస్టాండ్ , శ్రద్ధానంద్ గంజ్ , దుబ్బ , అరుంధతి నగర్ , సుభాష్ నగర్ , చంద్రశేఖర్ కాలనీ, కంటేశ్వర్ , విద్యుత్ నగర్, గూపన్ పల్లి , ముబారక్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యవేక్షిం చడం జరిగింది. ఈ సందర్భముగా ఖిల్లా రోడ్ లో జరిగినటువంటి ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైనటువంటి వాహనదారులను హుటాహుటిన ఆటోలో ప్రభుత్వ హాస్పటల్ తరలించడం జరిగింది.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


