​నవంబర్ 15 నుంచి 18 వరకు జాతీయ మహాసభలు

​నవంబర్ 15 నుంచి 18 వరకు జాతీయ మహాసభలు

  • నల్లగొండలో అఖిలభారత 36వ రైతు సంఘం మహాసభలు
  •  కరపత్రాల విడుదల, ఊపందుకున్న ప్రచారం
  • 17న లక్ష మందితో భారీ బహిరంగ సభ
    ​రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం
  • రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం

​నల్గొండ/మర్రిగూడ : వీర తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అయిన నల్లగొండ జిల్లా కేంద్రంలో రాబోయే నవంబర్ 15 నుంచి 18 వరకు అఖిలభారత 36వ రైతు సంఘం జాతీయ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మహాసభల ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం మంగళవారం కరపత్రాలను పంపిణీ చేసి, ముమ్మర ప్రచారం నిర్వహించారు. ​ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి జాతీయ నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు మరియు రైతాంగ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. దేశంలో ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాలు, మద్దతు ధరల లేమి, రుణభారం వంటి అంశాలపై ఈ వేదికగా సమగ్రంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 17న నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు దాదాపు లక్ష మంది రైతులు, ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

​రైతాంగ వ్యతిరేక ఒప్పందాలపై పోరు

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశీయ వ్యవసాయ రంగానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నూతన విద్యుత్ సంస్కరణల బిల్లు ఉచిత విద్యుత్ విధానానికి ముప్పుగా పరిణమిస్తుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని ఏకం చేసి పోరాటాలకు సిద్ధం చేస్తామని హెచ్చరించారు. గతంలో ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం పాటు సాగిన చారిత్రాత్మక రైతు పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీలను వెంటనే నిరంతరం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

​సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి

నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, చివరి ఆయకట్టు వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను మమ్మరం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.​ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ సభ్యులు మైల సత్తయ్య, సల్బోజు రామలింగాచారి, దామెర లక్ష్మి, ఏరుకొండ రాఘవేంద్ర, అరవింద్, ఊరుపక్క నరేందర్, ఏరుకొండ రమేష్, ఊరుపక్క ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 182

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News