మహబూబ్‌నగర్,:విద్య, పరిశోధన, పరిశ్రమ, సాంకేతికత, యువశక్తిని సమన్వయం చేయడం ద్వారా మాత్రమే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పలువురు ప్రముఖ నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థల్లో అందించే విద్య పరిశ్రమల్లో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న “విజన్ ఇండియా @2047” ద్విదిన జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా పాలమూరు యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో “అకాడమిక్ అండ్ ఇండస్ట్రీ అనుసంధానం” అంశంపై ప్యానెల్ చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలు–పరిశ్రమల మధ్య సమన్వయం, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, యువతకు అవకాశాలపై నిపుణులు విస్తృతంగా చర్చించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ప్ర స్తుతం పరిశ్రమలు కోరుతున్న నైపుణ్యాలు, విద్యార్థులు విద్యాసంస్థల్లో పొందుతున్న నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు తమ కరిక్యులమ్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు తరగతి గది విద్యతో పాటు పరిశ్రమల్లోని వాస్తవ పరిస్థితులను తెలుసుకునేలా ఇంటర్న్‌షిప్‌లు, ఇండస్ట్రీ విజిట్లు, లైవ్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీ మెంటరింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలని తెలిపారు. పరిశోధన–పరిశ్రమల భాగస్వామ్యం పెరగాలి పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు పరస్పర సహకారంతో పనిచేస్తే కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేసే అవకాశం పెరుగుతుందని నిపుణులు తెలిపారు. Industry-sponsored research, collaborative projects, technology transfer, incubation centres, innovation hubs, start-up ecosystem వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు పరిశోధన ఫలితాలను సమాజానికి, పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా మలచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నైపుణ్యాలతో యువతకు భవిష్యత్ అవకాశాలు వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని నిపుణులు అన్నారు. విద్యార్థుల్లో Critical Thinking, Problem Solving, Creativity, Communication Skills, Leadership Skills, Digital Skills వంటి నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువతను కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయాలు ప్రోత్సాహం అందించాలని సూచించారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ ఆధారిత వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ప్రముఖ నిపుణుల ప్యానెల్ఈ  ప్యానెల్ చర్చకు ప్రొఫెసర్ పాట్రిక్, ఓయూ కామర్స్ మోడరేటర్‌గా వ్యవహరించారు. డా. ఎన్. రాజేందర్, సీనియర్ సైంటిస్ట్, NIN, పరిశోధనా సంస్థలు–విశ్వవిద్యాలయాల మధ్య బలమైన భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు. డా. జోషి, డీన్, SVS మెడికల్ కాలేజ్, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య రంగంలో పరిశ్రమల సహకారం ప్రాధాన్యతను వివరించారు. ఆధునిక సాంకేతికతను వైద్య విద్యతో అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్ వైద్య నిపుణులను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.ప్రొఫెసర్ సాయి ప్రసాద్, BITS పిలాని, ఉన్నత విద్యలో నాణ్యత, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు కేవలం డిగ్రీ పొందడమే కాకుండా సమస్యలను గుర్తించి వాటికి సాంకేతిక పరిష్కారాలు చూపించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.TSV రమణ, కో-ఫౌండర్ & CEO, కోడ్ తంత్ర, పరిశ్రమల్లో మారుతున్న అవసరాలు, సాంకేతిక నైపుణ్యాల ప్రాధాన్యత, ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్‌పై వివరించారు. విద్యాసంస్థలు పరిశ్రమలతో నిరంతర సంభాషణ కొనసాగిస్తే విద్యార్థులను ఉద్యోగ అవకాశాలకు మరింత సమర్థవంతంగా సిద్ధం చేయవచ్చని పేర్కొన్నారు.విశ్వవిద్యాలయాలు పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రాలుగా ఎదగాలి ఈ కార్యక్రమానికి పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్యానెల్ సభ్యులను అభినందించిన ఆయన, విశ్వవిద్యాలయాలు కేవలం విద్యను అందించే కేంద్రాలుగా కాకుండా పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యానికి కేంద్రాలుగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించేందుకు పాలమూరు యూనివర్సిటీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అకాడమిక్ సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు పరస్పర సహకారంతో పనిచేసినప్పుడే విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు దేశ అభివృద్ధికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు.వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై విద్య, పరిశ్రమ, పరిశోధన, సాంకేతికత, యువత అంశాలపై సమగ్రంగా చర్చించడం సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్యానెల్ సభ్యులు తమ అనుభవాలను విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులతో పంచుకోవడంతో కార్యక్రమం విజ్ఞానాత్మకంగా సాగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, పరిశ్రమ ప్రతినిధులు, వివిధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.