వర్షాల కోసం వెంకన్న సన్నిధిలో వరద పాశం
- ప్రత్యేక పూజలు.. తీర్థప్రసాదాలు.. అన్నదానం
- రైతాంగం సుభిక్షంగా ఉండాలని భక్తుల ప్రార్థనలు
మర్పల్లి:(వికారాబాద్ జిల్లా) మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర గుట్టపై వెలసిన శ్రీ ధనలక్ష్మివెంకటేశ్వర స్వామివారికి శనివారం స్థానిక భక్తులు భక్తిశ్రద్ధలతో వరద పాశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి స్వామివారిని ప్రార్థించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని, ప్రజలు సుభిక్షంగా జీవించాలని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ, వ్యవసాయాధారిత ప్రాంతమైన మర్పల్లి మండలంలో రైతుల భవిష్యత్తు వర్షాలపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, బోర్లు జలకళ సంతరించుకోవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపదకు మేత, తాగునీటి కొరత లేకుండా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి భావంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


