రక్తదానంతో తలసేమియా బాధితులకు పునర్జన్మ
- మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత
- మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం
- హజ్రత్ మహమ్మద్ సందేశంతో మానవత్వ సేవకు శ్రీకారం చుట్టిన ఐక్య సంఘం నేతలు ముజాహిద్-హుస్సేన్‌లు
మధిర, : ప్రాణాపాయంలో ఉన్న తలసేమియా చిన్నారులకు రక్తదానం ద్వారా పునర్జన్మ అందించడమే నిజమైన మానవత్వమని మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత ఉద్ఘాటించారు.మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని (మిలాద్-ఉన్-నబీ) పురస్కరిం చుకుని బుధవారం తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలసేమియా బాధితుల ఉచిత రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ పవిత్రమైన పర్వదినాన ఇలాంటి ఉన్నతమైన సేవా కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని,ఆత్మీయ తృప్తిని ఇచ్చిందని తెలిపారు.మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి ప్రేమ, దయ,కరుణ,సహనం, సోదరభావం వంటి గొప్ప విలువలను బోధించారని,ఆయన దివ్య సందేశం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని తెలిపారు.హజ్రత్ మహమ్మద్ జీవితం నుండి అందరూ స్ఫూర్తి పొందుతూ, పరస్పర సామరస్యంతో జీవిస్తూ దేశ పురోగతి కోసం నిరంతరం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రవక్త బోధించిన మానవతా విలువలను ఆచరణలో చూపిస్తూ, ఈ మిలాద్-ఉన్-నబీ పర్వదినాన ఐక్య సంఘం నాయకులు ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.ముఖ్యంగా ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నపిల్లల ప్రాణాలను కాపాడాలనే ఉన్నతమైన లక్ష్యంతో తెలంగాణ ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్,రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్‌లు ముందుకొచ్చి ఈ శిబిరాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు.ప్రాణాపాయంలో ఉన్న పిల్లల కోసం ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ముజాహిద్,హుస్సేన్‌లు కేవలం ఈ రక్తదాన శిబిరానికే పరిమితం కాకుండా,సమాజంలో ఎక్కడ ఆపద ఉన్నా అండగా నిలుస్తూ అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను నిరంతరం కొనసాగించటం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా పరిధిలోని ముష్టికుంట,ఎర్రుపాలెం, దెందుకూరులతో పాటు పలు ప్రాంతాల్లో మసీదుల నిర్మాణాలు చేపడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను,శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని చైర్‌పర్సన్ గుర్తుచేశారు.కులమతాలకు అతీతంగా,మానవత్వమే పరమావధిగా వీరు అందిస్తున్న ఆదర్శవంతమైన సేవలకు తమ పరిపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పవిత్ర పర్వదినం అందరి జీవితాల్లో శాంతి, సంతోషం,సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తూ, నాయకులకు,రక్తదానంలో పాల్గొన్న దాతలందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


