ఘనంగా కోలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
- -వైశ్య భవన్‌లో యువత ఆధ్వర్యంలో వేడుకలు..
- -80 నుంచి 100 మంది రక్తదానం
పెద్దపల్లి : ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోలిపాక శ్రీనివాస్ 38వ జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్‌లో యువత, అభిమానుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో యువత, అభిమానులు పాల్గొని శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి యువత నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 80 నుంచి 100 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా సేవాభావాన్ని చాటారని పలువురు అభినందించారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన యువతను కోలిపాక శ్రీనివాస్ శాలువాలతో ఘనంగా సన్మానించి, షీల్డులు, బహుమతులు అందజేశారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు రక్తదానం చేసిన యువతకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన 38వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా ప్రజలకు, యువతకు, అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తనపై చూపిస్తున్న అభిమానానికి రాబోయే రోజుల్లో ప్రజాసేవ ద్వారా రుణం తీర్చుకుంటానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ తనవంతు కృషి చేస్తానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తాననే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గతంలో వివిధ రాజకీయ పదవులు నిర్వహిస్తూ, పలు పార్టీలలో పనిచేసిన అనుభవంతో ప్రజలకు తనవంతు సేవలు అందించానని పేర్కొన్నారు. బీసీ నాయకుడిగా ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు పెద్దన్నగా అండగా నిలిచి తనవంతు ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తన జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదానం చేసి తనపై అభిమానాన్ని చాటిన ప్రతి ఒక్కరికీ కోలిపాక శ్రీనివాస్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువత, అభిమానులు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


