హమీలు విస్మరించిన మంత్రి జూపల్లి:
- కొల్లాపూర్ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం
- బీజేపీ వనపర్తి జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ మేకల చెన్నయ్య యాదవ్ తీవ్ర ధ్వజం
చిన్నంబావి, : కొల్లాపూర్ నియోజకవర్గాన్ని సుందర కోనసీమగా మారుస్తానని సుదీర్ఘకాలంగా ప్రగల్బాలు పలికిన మంత్రి జూపల్లి కృష్ణారావు, గెలిచాక గతంలో ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ మేకల చెన్నయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీశైలం నీటి ముంపు బాధితుల 98 జీవో అమలును గాలికి వదిలేశారని, సింగోటం-గోపాల్‌దిన్నె రిజర్వాయర్ లింక్ కెనాల్ పనులను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. చిన్నంబావి మండలానికి మంజూరైన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టును ఇక్కడి నుంచి వెనక్కి పంపించడం స్థానిక ప్రజలకు చేసిన తీవ్ర ద్రోహమని, అయ్యవారిపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టడానికే పరిమితమై గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పదేపదే అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా చిన్నంబావి మండల కేంద్రంలో మహిళలకు కనీస సామూహిక మరుగుదొడ్ల సదుపాయం కూడా కల్పించలేకపోయారని మండిపడ్డారు. ఇటీవల సోమవారం నాడు రహదారుల శంకుస్థాపన కోసం కొల్లాపూర్ ప్రాంతానికి వచ్చిన రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుల పర్యటనలో చిన్నంబావి మండల కేంద్రంలో రోడ్డును పూర్తిస్థాయిలో ఆక్రమించి మీటింగ్‌లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రైవేట్ ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోకుండా, ఇలా ప్రధాన రహదారులపై సభలు పెట్టి సామాన్య ప్రజలను నడిరోడ్డుపై ఇబ్బందులకు గురిచేయడం ఏమాత్రం తగదని హితవు పలికారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి జూపల్లి వైఖరిని కొల్లాపూర్ తాలూకా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా ఆయనకు తగిన శాస్తి చేయడం ఖాయమని మేకల చెన్నయ్య యాదవ్ స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


