మత్తు పదార్థాల జోలికి వెళ్తే బంగారు భవిష్యత్తు చిత్తు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
హైదరాబాద్: మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగంలో 25 ఏళ్లలోపు యువత అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు.మత్తు పదార్థాల దుష్పరిణామాలపై యువతలో అవగాహన కల్పించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “నశా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా ప్రచార పోస్టర్‌ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు, యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలకు గురవుతారని అన్నారు. మత్తు అలవాట్లకు బానిసై తమ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవద్దని సూచించారు.దేశ యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుని, విద్య, ఉద్యోగం, క్రీడలు, సామాజిక సేవ వంటి సానుకూల కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని కేపీ వివేకానంద్ కోరారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వ సంస్థలతో పాటు స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సంస్థలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, యువత సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాజయోగిని బీకే జ్యోతి బహన్ జీ, ఎస్‌ఆర్ నగర్ ఇన్‌చార్జ్ బీకే మంజుల, బీకే నాందేవ్, బీకే నరేందర్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


