గణపతి నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి
- అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన డీజేలు, సౌండ్ సిస్టమ్‌లపై కేసులు
- కాచ్కంటి, భరంపూర్ గ్రామాల్లో డీజేలు, వాహనాలు సీజ్
- 30 పోలీస్ యాక్ట్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి
ఆదిలాబాద్ : గణపతి నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 23న కాచ్కంటి గ్రామంలో గణపతి నిమజ్జన బందోబస్తు సందర్భంగా అనుమతి లేకుండా వాహనంలో డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అధిక శబ్దంతో వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు డీజే యజమాని వావల్కర్ కళ్యాణ్, s/o యాదవ్‌పై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని భరంపూర్ గ్రామంలో గణపతి నిమజ్జన ఉత్సవాల సందర్భంగా రెండు గణపతి మండపాల మధ్య డీజే సౌండ్‌పై పోటీ ఏర్పడి, గొడవలకు దారితీసే పరిస్థితులు ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ డీజేలు నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసి, రెండు డీజే సౌండ్ సిస్టమ్‌లతో పాటు బొలెరో మ్యాక్స్ వాహనాన్ని సీజ్ చేశారు.
గణపతి నిమజ్జన ఉత్సవాల సందర్భంగా డీజేలు ఏర్పాటు చేయాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ స్పష్టం చేశారు. 30 పోలీస్ యాక్ట్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం, పోలీసుల సూచనలు పాటించకపోవడం, ఇతర మండపాలతో పోటీకి దిగడం లేదా గొడవలకు దారితీసే విధంగా వ్యవహరించడం వంటి చర్యలను ఉపేక్షించబోమని తెలిపారు.ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ గణపతి నిమజ్జన కార్యక్రమాలను భక్తి భావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


