రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం 

రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం 

హైదరాబాద్,: రాష్ట్రంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిర్వహణను కేవలం చలానాల విధింపు, వసూళ్లకే పరిమితం చేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల దర్యాప్తు, హైవే పెట్రోలింగ్, అత్యవసర సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు *తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఈ మేరకు G.O.Ms.No.135 జారీ చేసింది.  ముఖ్యమంత్రి అధ్యక్షతన పనిచేసే రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి పరిధిలో TG-TMARS పనిచేయనుంది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా అధికార పరిధి కలిగిన ఈ బ్యూరోకు ADGP లేదా IGP స్థాయి అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. పరిపాలనా, క్రమశిక్షణాపరమైన నియంత్రణ డీజీపీ పరిధిలో ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు–రైలు భద్రతకు సమగ్ర వ్యవస్థగా ఇది పనిచేయనుంది. 

32 వేల కిలోమీటర్ల రోడ్లపై పర్యవేక్షణ

తెలంగాణలోని 32 వేల కిలోమీటర్లకు పైగా రహదారులు, 1.8 కోట్లకు పైగా నమోదైన వాహనాల రాకపోకలను బ్యూరో పర్యవేక్షించనుంది. జాతీయ, రాష్ట్ర రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఓఆర్‌ఆర్‌తో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల ట్రాఫిక్ నిర్వహణపై సమగ్ర పర్యవేక్షణ ఉంటుంది. రోడ్డు రవాణాతో పాటు మెట్రో, రైల్వే ప్రయాణ భద్రతకు సంబంధించిన బాధ్యతలను కూడా TG-TMARSకు అప్పగించారు. 

 ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రోడ్డు ప్రమాద స్పందన అధికారి 

ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్‌లో Road Accident Response Officerను నియమించి 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి తరలించడం, ప్రమాద స్థలాన్ని భద్రపరచడం, ప్రమాద వివరాలను నమోదు చేయడం వంటి బాధ్యతలు అప్పగించనున్నారు. 

 హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్ 

ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ, రాష్ట్ర రహదారులు, 50 కిలోమీటర్లకు పైగా హైవే ఉన్న ప్రాంతాల్లో హైవే పెట్రోలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో స్పీడ్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, డ్యాష్‌బోర్డ్ కెమెరాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలు వినియోగించనున్నారు. వేగం, తప్పుదారి డ్రైవింగ్, లేన్ ఉల్లంఘనలు తదితర ప్రమాదకర నిబంధనల ఉల్లంఘనలపై పర్యవేక్షణ పెంచనున్నారు. 

 ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్ ఏర్పాటు 

TG-TMARS కార్యకలాపాలకు ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. పోలీసులకు వచ్చే మోటారు వాహనాల చట్టం కింద వసూలయ్యే కాంపౌండింగ్ ఫీజులు, జరిమానాల్లో 40 శాతం ఈ నిధికి జమ చేయనున్నారు. ఈ నిధులను సిబ్బంది శిక్షణ, అధునాతన ఎలక్ట్రానిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పరికరాలు, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లు, పెట్రోలింగ్ వాహనాలు, అత్యవసర రహదారి మరమ్మతులు, రోడ్డు భద్రతా చర్యలకు వినియోగించనున్నారు. 

ట్రాఫిక్ విభాగానికి కొత్త నిర్మాణం

రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణలో ఏకరీతి ప్రమాణాలు, సాంకేతికత, శిక్షణ, డేటా విశ్లేషణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఒకే వ్యవస్థను తీసుకురావడం TG-TMARS ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రతి పోలీస్ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ (ట్రాఫిక్) పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. అలాగే 300 పోస్టులను ఇతర పోలీస్ విభాగాల నుంచి TG-TMARSకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్రాఫిక్ నియంత్రణలో కేవలం నిబంధనల అమలుకే కాకుండా శాస్త్రీయ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని, రద్దీ సమయాలు, కార్యాలయాల పనివేళలు, వాతావరణ పరిస్థితులు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో స్మార్ట్ సిగ్నలింగ్, అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లపై అధ్యయనం చేయాలని కూడా సూచించారు.  ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రమాద బాధితులకు సత్వర వైద్యం, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి అంశాలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో రోడ్డు, రైలు భద్రతను మరింత సమగ్రంగా పర్యవేక్షించేందుకు TG-TMARSను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని