ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దదిక్కుగా దేవాదుల
- ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల పెద్ద దిక్కుగా మారడం నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత సంతృప్తి ఇచ్చే అంశమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం స్టేషన్ ఘన్‌పూర్ రిజర్వాయర్ నుండి కింద ఉన్న ఆయకట్టుకు పంట కాలువ ద్వారా సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్బంగా తూము వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పూలుసమర్పించారు. అనంతరం పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల పనులను 6నెలల్లో 100శాతం పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు రెండు పంటలకు సాగు నీరు అందించడమే ఏకైక లక్ష్యమని అన్నారు. అందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించి పూర్తి చేశారని ఆ తర్వాత నాణ్యత లోపం వల్ల మేడిగడ్డ కుంగిపోయిందని తెలిపారు. మేడిగడ్డ కుంగిపోయిన సమయంలో కూడా కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నాడని అందులో ఏమైనా అనుమానాలు ఉంటే అప్పుడే ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మేడిగడ్డ నుండి 1టీఎంసి కూడా ఎత్తిపోయకుండా వరుసగా రెండు సంవత్సరాలు దేశంలోనే అత్యంత ఎక్కువ ధాన్యం దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని గుర్తుచేశారు. బిఆర్ఎస్ నాయకులు ధరణిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ, అసైండ్, ప్రయివేట్ భూములను కొల్లగొట్టారని అన్నారు. వందల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. 2014కు ముందు కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వయంగా కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీపై, బిఆర్ఎస్ నాయకులపై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. గతంలో విద్యా శాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తిగా జీవో 97ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, నేతలు బెల్దె వెంకన్న, అంబటి కిషన్ రాజు, భూర్ల శంకర్, కౌన్సిలర్లు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


