ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు బదిలీ రవాణా అలవెన్స్ ఇవ్వాలి
నల్గొండ/మర్రిగూడ:2007 నుండి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో ఆరోగ్య మిత్రాలుగా పేద ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న వారికి మాత్రమే టీమ్ లీడర్లుగా ప్రమోషన్ పొందే అవకాశం కల్పించాలని ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. అలాగే అత్యల్ప వేతనాలతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగులందరికీ తక్షణమే రవాణా భత్యం వర్తింపజేయాలని కోరింది.ఈ మేరకు ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య నాయకత్వంలో ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ కేంద్ర కార్యాలయంలో ట్రస్ట్ జనరల్ మేనేజర్ నరేష్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిరి యాదయ్య మాట్లాడుతూ ట్రస్ట్ ప్రారంభం నుండి క్షేత్రస్థాయిలో పేద రోగులకు ప్రాణదాతలుగా సేవలు అందిస్తున్న ఆరోగ్య మిత్రల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, బయటి వారికి టీమ్ లీడర్ అవకాశాలు ఇవ్వడం సబబు కాదన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆరోగ్య మిత్రులకే ప్రాధాన్యతనిచ్చి టీమ్ లీడర్లుగా పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేశారు. అలాగే పెరిగిన నిత్యావసరాల ధరలు, ప్రయాణ ఖర్చుల దృష్ట్యా తక్కువ వేతనంతో పనిచేస్తున్న సిబ్బందికి రవాణా అలవెన్స్ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై స్పందించిన జనరల్ మేనేజర్ నరేష్ కుమార్ ఉద్యోగుల సమస్యలను, డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి సానుకూలంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, ఆరోగ్యశ్రీ ఉద్యోగులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


