బీసీ స్మశాన వాటికలకు మహర్దశ..
-అన్ని మౌలిక వసతులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి.
-ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు (వికారాబాద్ జిల్లా) నియోజకవర్గ పరిధిలోని బీసీ స్మశాన వాటికలను దశలవారీగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ పట్టణంలోని ప్రధాన బీసీ స్మశాన వాటికలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకు న్నారు.ప్రధాన బీసీ స్మశాన వాటిక అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్మశాన వాటికలను పరిశుభ్రంగా, సురక్షితంగా, ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలుచేపడుతున్నామని పేర్కొన్నారు.అదేవిధంగా పాత తాండూర్‌లోని 14వ వార్డు బోనమ్మ టెంపుల్ సమీపంలోని స్మశాన వాటికలో ఏడాది క్రితమే బోర్ ఏర్పాటు చేసి నీటి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అక్కడ కంపౌండ్ వాల్ నిర్మాణం కోసం తాజాగా రూ.10 లక్షల నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు.నియోజకవర్గంలోని అన్ని బీసీ స్మశాన వాటికల్లో అవసరాలను గుర్తించి, దశలవారీగా నిధులు సమకూర్చి మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మశాన వాటికలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, బీసీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


