రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి పొన్నం
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయరమణ రావు, వేముల వీరేశం ఆయన వెంట ఉన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి, అన్నదానం, గోశాల, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వేములవాడను దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆలయాల అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చేపడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


