మేము ప్రజలకే జవాబుదారీ, బీజేపీ నాయకులకు కాదు
ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
- సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా తెలంగాణ ప్రగతి
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని పథకాలు తెలంగాణలో అమలు
- తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటుంది
- ఇక్కడి ఓట్లతో గెలిచినా బీజేపీ గుజరాత్ పాట పాడుతుంది
- అభివృద్ధి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు
* వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ చిల్లర రాజకీయాలు
నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని, ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో బీజేపీ రాజకీయ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలను జోడెద్దుల్లా సమన్వయం చేసుకుంటూ తెలంగాణ ప్రగతి ప్రయాణం కొనసాగుతోందన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని భూపతి రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించామని, నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడంతో పాటు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుంటే, వాటిని స్వాగతించాల్సిన ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి.. ఇతర రాష్ట్రాల పాట పాడటమా?
తెలంగాణ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన బీజేపీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రాజకీయ ఎజెండాను ఇక్కడ వినిపించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతను గుర్తించి రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన నాయకులు, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ రాజకీయ ప్రదర్శనలకు దిగడం వారి రాజకీయ వైఖరిని తెలియజేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే గా ధన్ పాల్ సూర్యనారాయణ, ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పనితీరుపై ప్రజలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని, ప్రజలే తమకు అంతిమ నిర్ణేతలని పేర్కొన్నారు. అయితే బీజేపీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, తమ పాలనకు ప్రజలే సాక్ష్యమని స్పష్టం చేశారు
తెలంగాణ ఆదాయంతో ఇతర రాష్ట్రాలకు లబ్ధి.. రాష్ట్రానికి మాత్రం అన్యాయం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో వివక్ష చూపుతోందని భూపతి రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి ఆదాయం సమకూర్చుకుంటూ, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలన్న రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కేంద్రం పట్టించుకోవడం లేదని, రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన ప్రయోజనాలను సాధించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే, ఆ అడుగులకు అడ్డుపడే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రోడ్లపై ధర్నాలు
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల పురోగతి, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాల్సిన సమయంలో బీజేపీ నాయకులు అనవసర రాజకీయ వివాదాలను తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ప్రజలు ప్రశ్నించకుండా పక్కదారి పట్టించేందుకే రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హక్కుల కోసం బీజేపీ నాయకులు పోరాడాలని హితవు పలికారు.
ప్రజలే తగిన సమాధానం చెబుతారు
రాజకీయ విమర్శలు, ఆందోళనలతో ప్రజలను ఎక్కువకాలం తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని భూపతి రెడ్డి అన్నారు. ప్రజలు ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తున్నారని, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు.. ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారో వారికి స్పష్టంగా తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తుందని తెలిపారు. బీజేపీ నాయకుల రాజకీయ డ్రామాలకు ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


