సింగరేణికి రూ.55 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి: బీజేపీ డిమాండ్
రేపు నస్పూర్ సీసీసీ కార్నర్ వద్ద "సింగరేణి బకాయి - బీజేపీ లడాయి" ధర్నా
నస్పూర్ (మంచిర్యాల): రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం (30.09.2026) నస్పూర్ సీసీసీ కార్నర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో "సింగరేణి బకాయి - బీజేపీ లడాయి" పేరిట భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నా ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, కొత్త గనుల ఏర్పాటుతో పాటు కార్మికులకు కనీస భద్రతా పరికరాలైన బూట్లు, టోపీలు కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. రేపు ఉదయం జరగనున్న ఈ ధర్నాకు ముఖ్య అతిథులు గా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్రం రమేష్, కుర్రే చక్రవర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, కమలం రావు, బేరా సత్యనారాయణ, కమలాకర్ రావు, పొన్నవేణి సదయ్య, మల్కా రాజేశం, బుద్దే రవి, బద్రి శ్రీకాంత్, బూర్ల చిరంజీవి, కొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


