బాలాజీ రైస్ మిల్లుపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడులు!
- వాహనంతో పాటు 3600 కిలోల భారీగా నల్లబెల్లం స్వాధీనం.
- సాతాపూర్ లో ముగ్గురు అరెస్ట్, పరారీలో ఒకరు..
కొల్లాపూర్ /పెద్దకొత్తపల్లి : నాగర్‌కర్నూల్ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లాన్ని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికా రులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. నాగర్‌కర్నూల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు కొల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం సాతపూర్ గ్రామంలో ఈ దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జిన్నా నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాతపూర్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా నల్లబెల్లం విక్రయాలు జరుపుతున్నాడనే నమ్మదగిన సమాచారంతో, అతనికి చెందిన బాలాజీ రైస్ మిల్‌పై అధికారులు హఠాత్తుగా దాడులు చేశారు. రైస్ మిల్ వెనుక భాగంలో నిలిపి ఉంచిన అశోక్ లేలాండ్ వాహనం (టి జి 07యు 6591)లో అక్రమంగా నిల్వ ఉంచిన 120 బస్తాల (సుమారు 3600 కిలోలు) నల్ల బెల్లాన్ని కనుగొని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్న బీహార్‌కు చెందిన రాంబాబు రాయ్, కృష్ణ యాదవ్‌లతో పాటు తెలకపల్లికి చెందిన మహమ్మద్ అలీని ఎక్సైజ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. కాగా, ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై నలుగురిపై కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న నల్లబెల్లం, వాహనంతో పాటు అరెస్టు చేసిన నిందితుల ను కొల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఈ దాడుల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాసురామ్ నాయక్, కె. శ్రీనివాస్, శ్రీనివాస్ నాయక్, అనూష, డ్రైవర్ శివ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


