జేఎన్‌టీయూహెచ్ కళాశాలను సందర్శించిన 10వ తరగతి విద్యార్థులు
క్షేత్రపర్యటనతో ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలపై అవగాహన
చౌటకూర్, : ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (యూసీఈఎస్)ను ఆందోల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు మంగళవారం క్షేత్రపర్యటనలో భాగంగా సందర్శించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో మొత్తం 79 మంది విద్యార్థులు ఈ విద్యా పర్యటనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాలు, ఆధునిక సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ సెంటర్లు, లైబ్రరీ తదితర విభాగాలను ఆసక్తిగా సందర్శించారు. కళాశాల అధ్యాపకులు, ప్రయోగశాల సహాయకులు విద్యార్థులకు వివిధ సైన్స్ ప్రయోగాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్ విద్యా విధానం, ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. విశ్వనాథ్ రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్, సాంకేతికతపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్షేత్రపర్యటనను నిర్వహించినట్లు తెలిపారు. పుస్తకాల్లో చదివే విషయాలతో పాటు ఉన్నత విద్యాసంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా విద్యార్థులకు ప్రయోగశాలలు, సాంకేతిక పరికరాలు, ఇంజనీరింగ్ విభాగాలపై ఆచరణాత్మక అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి విద్యా పర్యటనలు విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రేరణనిస్తాయని అన్నారు.క్షేత్రపర్యటన ద్వారా ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలకు సంబంధించిన అనేక విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించిందని విద్యార్థులు తెలిపారు. కళాశాలలోని ప్రయోగశాలలు, సాంకేతిక విభాగాలను సందర్శించడం తమలో ఉన్నత విద్యపై మరింత ఆసక్తిని పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎం. శైలజ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి, వివిధ విభాగాల అధ్యాపక బృందం, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


