ఆదిలాబాద్ రిమ్స్‌లో వైద్య సేవల పురోగతిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలి:జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ రిమ్స్‌లో వైద్య సేవల పురోగతిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులతో పాటు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబీఎన్‌ఐసీయూ, గైనకాలజీ వార్డులను కలెక్టర్ పరిశీలించి, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రసవానంతరం బాలింతలు, నవజాత శిశువులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించే ప్రక్రియపై వైద్యులతో చర్చించారు. వైద్యులు, సిబ్బంది ప్రస్తావించిన చిన్నపాటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఒకటి రెండు రోజుల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.13 కోట్ల నిధులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం మున్సిపల్, పంచాయతీరాజ్, టీజీఎంఎస్‌ఐడీసీ, ఆర్‌అండ్‌బీ తదితర ఇంజినీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో రోగుల రద్దీ ఎక్కువగా ఉండే సమయాలను దృష్టిలో ఉంచుకుని టాయిలెట్ల మరమ్మతులు, పెయింటింగ్, ఆక్సిజన్ పైప్‌లైన్ ఏర్పాటు, ఇతర మరమ్మతు పనులను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ఒకేసారి వివిధ పనులు కొనసాగుతున్నప్పుడు రోగులు, వారి సహాయకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ప్రణాళికతో పనులు నిర్వహించాలని ఆదేశించారు.రిమ్స్ ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద తాగునీటి సౌకర్యం, స్కానింగ్ పరికరాలు, చెత్తబుట్టలు, షూ ర్యాక్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణ సంస్థలు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులు ఆసుపత్రి నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. రిమ్స్‌లో రోగుల రద్దీ అధికంగా ఉండే గైనకాలజీ, పీడియాట్రిక్ వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ఇటీవల కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంపికైన వైద్యుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని, అవసరమైన వార్డుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రిమ్స్‌లో వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు నిరంతర తనిఖీలు, సమీక్షలు కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పారిశుధ్యం, వైద్య సిబ్బంది అందుబాటు, రోగులకు అవసరమైన సౌకర్యాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్, రిమ్స్, మున్సిపల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-29 at 9.05.37 AM

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News